వాలంటీర్ వ్యవస్థను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ముప్పేట దాడి చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు జనసేనానిపై మండిపడుతున్నారు. ఇప్పటికే మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. పోలీసులకు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. విషయం డీజీపీ వరకు వెళ్లింది. బుధవారం వైసీపీ లీగల్ సెల్ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ రోజు పలువురు వాలంటీర్లతో కలిసి వైసీపీ లీగల్ సెల్ కు చెందిన పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అనంతరం న్యాయవాదులు మాట్లాడుతూ... వాలంటీర్ వ్యవస్థ లేకుంటే కరోనా సమయంలో చాలా ఇబ్బందులు ఉండేవన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేస్తోన్న ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పవన్ మాటలతో సభ్యసమాజంలో అలజడి రేగుతోందన్నారు. కానీ ఇలాంటి మాటలను వాలంటీర్లు పట్టించుకోవద్దని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. వుమెన్ ట్రాఫికింగ్ పై పవన్ కు ఏ నిఘా సంస్థ అధికారి చెప్పారో బహిర్గతం చేయాలన్నారు. వాలంటీర్లపై ఇష్టారీతిగా మాట్లాడినందుకు వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.