అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయ విధానాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న మార్పులకు నాంది పలికిందని సాగు వ్యయం, ధరల కమిషన్ (సీఏసీపీ) చైర్మన్ ప్రొఫెసర్ విజయ్‌పాల్ శర్మ ప్రశంసించారు. ఆర్బీకేలతో గ్రామ స్థాయిలో రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు అందరికీ ఆదర్శం, అనుసరణీయమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన ఆర్బీకేలు తాను విన్నదాని కంటే మరింత గొప్పగా ఉన్నాయని కితాబిచ్చారు. జాతీయ స్థాయిలో కిసాన్ కాల్ సెంటర్లు ఉన్నా ఏపీ స్థాయిలో సేవలందించడం లేదన్నారు. ‘వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు నిజంగా ఓ అద్భుతం.. నాకు తెలిసి ఇలాంటి వ్యవస్థ దేశంలోనే కాదు... ప్రపంచంలోనే ఎక్కడా లేదు’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా పంటల కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం (ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్), ఆర్బీకే ఛానల్‌ను సందర్శించారు.