ముక్కుపచ్చలారని శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటుంటే.. ఆ దృశ్యం చూసి స్థానికుల గుండె తరుక్కుపోయింది. విశాఖపట్నం జిల్లా దువ్వాడలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 15 నెలల ఆడ శిశువును కన్నతల్లే కడతేర్చిందని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శిశువు తల్లి స్వప్న సుందరిని విచారిస్తున్నారు. యలమంచలికి చెందిన స్వప్న కొన్నేళ్ల కిందట సాయి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరూ విజయవాడలో కాపురం పెట్టారు. 15 నెలల కిందట వీరికి కుమార్తె గీతాశ్రీ జన్మించింది.
అయితే, కొన్ని నెలలుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మూడు నెలల కిందట స్వప్న సుందరి విశాఖ వచ్చేసింది. మాజీ ప్రియుడు రమణతో కలిసి వైజాగ్‌లోని మంగలపాలెం జీఎంఆర్ కాలనీలో ఓ గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.
సోమవారం (జూలై 17) చిన్నారి గీతాశ్రీ అల్లరి చేస్తుండటంతో తల్లి స్వప్న.. గరిటతో బలంగా కొట్టినట్లు సమాచారం. దీంతో చిన్నారి తలకు బలమైన గాయమైంది. ఆ తర్వాత గాయానికి పసుపు పూసి పడుకోబెట్టింది. అయితే, కాసేపటికే పాప అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా చిన్నారి మృతదేహాన్ని దువ్వాడలోని బ్లాక్ 70లో ఇంటి వెనుక పూడ్చి పెట్టిందని స్థానికులు చెబుతున్నారు.
వర్షాల కారణంగా బయటపడిన చిన్నారి మృతదేహాన్ని వీధి కుక్కలు బయటకి లాగడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కుక్కలు శిశువు మృతదేహాన్ని పీక్కు తింటుంటగా.. అటుగా వచ్చిన స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక స్వప్న సుందరి ప్రియుడి హస్తం ఉందా? ప్రియుడి కోసం బిడ్డ అడ్డు తొలగించుకోవాలని భావించి ఈ దారుణానికి ఒడిగట్టిందా అనే కోణంలోనూ పోలీసులు కేసు విచారిస్తున్నారు.