నెల్లూరులో కోర్కెల పండుగగా ప్రసిద్ధిగాంచిన రొట్టెల పండుగ శనివారం ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పండుగకు నెల్లూరులోని బారాషాహీద్ దర్గా, స్వర్ణాల చెరువు ముస్తాబయ్యాయి. 29వ తేదీన సందన్ మాలి (సమాధులను శుభ్రం చేయడం), 30న గంధ మహోత్సవం, 31న రొట్టెల పండుగ, ఆగస్టు 1న తహలిల్ ఫాతేహా (గంధం పంపిణీ చేయడం), 2వ తేదీన పండుగ ముగింపు జరుగుతుంది. రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో మనసులో కోరుకొని రొట్టెను పట్టుకుంటే అది నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. రొట్టెలు పట్టుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.