పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో కేవలం సాగు నీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని, తాగు నీటి విభాగం కోసం చేసే ఖర్చును భరించే ప్రసక్తే లేదంటూ ఇన్నాళ్ళు మొండికేసిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని తాగునీటి విభాగానికి ప్రతిపాదించిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది. రాజ్యసభలో సోమవారం వైయస్ఆర్ సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయంకు సంబంధించిన 55,548 కోట్ల రూపాయల నిధుల గురించి అడిగిన ప్రశ్నకు జలశక్తి మంత్రి బిశ్వేశ్వర్ తుడు జవాబిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్ విభాగానికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి 10,911.15 కోట్లు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్ట్ నిర్మాణంలో మరమ్మతు పనుల నిమిత్తం అదనంగా మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిరభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు. అలాగే తాగునీటి విభాగానికి సంబంధించిన ప్రతిపాదిత ఖర్చును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించేందుకు ఆ విభాగం ఎలాంటి అభ్యంతరం లేదని తమకు సమాచారం ఇచ్చిందని మంత్రి చెప్పారు.