తాడేపల్లి ప్యాలెస్ ను దాటి జగన్ బయటకు రారని... ఇంటి నుంచి బయటకు వస్తే ఎన్నో చెట్లను నరికివేస్తారని, స్థానికంగా ఉన్న జనాలకు ఉపాధి పోతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. . ఈ రాత్రి పోలవరంలో ఉన్న నేతలను జగన్ కలుస్తున్నారని తెలిపారు. సాధారణంగా జగన్ ఎవరినీ కలవరని, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని గ్రహించి ఇప్పుడు కలుస్తున్నారని చెప్పారు. పోలవరం ప్రాంతంలో జగన్ పర్యటనలో అసలైన వరద బాధితులను వైసీపీ నేతలు మాట్లాడనివ్వలేదని విమర్శించారు. సభలో జగన్ స్క్రిప్ట్ చదివారని ఎద్దేవా చేశారు. విపక్ష నేతల యాత్రల్లో జనాలను చూస్తే తమ పార్టీ వాళ్లకు కోపం వస్తుందని రఘురాజు అన్నారు. ఢిల్లీ ఆర్డినెన్సుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాత తమ పార్టీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదని చెప్పారు. ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు 'బ్రో' సినిమా గురించి మాట్లాడటం మానేసి... పోలవరం ప్రాజెక్టు అంశాన్ని చూడాలని హితవు పలికారు. రూ. 10 వేల కోట్లు తీసుకొచ్చి పోలవరం బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు.