ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంబ్రిడ్జ్ వర్సిటీ కాలేజీలో రామకథ ప్రవచనాలు,,,ముఖ్య అతిథిగా హాజరైన యూకే ప్రధాని రిషి

international |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2023, 09:54 PM

77వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని జీసస్ కాలేజీలో ఏర్పాటు చేసిన రామ కథ ప్రవచనం కార్యక్రమానికి ఆ దేశ ప్రధాని రిషి సునాక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మురారీ బాపు ఏర్పాటుచేసిన రామ కథ వినేందుకు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా సునాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇక్కడకు ప్రధానిగా రాలేదని, ఓ హిందువుగా వచ్చానని అన్నారు. ‘ఈ కార్యక్రమానికి హాజరుకావడం నాకెంతో గర్వకారణం. ఇక్కడకు నేను ప్రధానిగా కాకుండా ఓ హిందువుగా వచ్చాను’ అని రిషి సునాక్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్‌ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తొలి శ్వేతజాతీయేతర వ్యక్తిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, గతంలోనూ పలు సందర్భాల్లో తాను హిందువునని బహిరంగంగానే ప్రకటించారు. ఆయన బాల్యం మొత్తం సౌతాంప్టన్‌లోనే గడిచింది. రామకథ ప్రవచనానికి హాజరైన ప్రధాని రిషికి మురారీ బాపు సాదర స్వాగతం పలికారు. ‘ఓ సాధారణ వ్యక్తిగా ఇక్కడికొచ్చిన మీకు ఘన స్వాగతం’ అని ఆయన వ్యాఖ్యానించారు. హిందూమత విశ్వాసాలు తన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయని, ప్రధానిగా వీలైనంత మెరుగ్గా పనిచేసేందుకు ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా రిషి సునాక్ అన్నారు.


ఇదే సమయంలో ప్రవచనం వేదికపై బాపు మురారీ ఆసనం వెనుక ఏర్పాటు చేసిన హనుమంతుడి పోస్టర్‌‌ను ప్రస్తావించిన రిషి సునాక్.. తన అధికారిక కార్యాలయంలోని టేబుల్‌పై కూడా గణేశుడి విగ్రహం ఉంటుందని తెలిపారు. ఏ పని ప్రారంభించే ముందైనా జాగ్రత్తగా పరిశీలించాలన్న విషయాన్ని తనకు ఆ విగ్రహం గుర్తు చేస్తుంటుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రిషి తన బాల్య జ్ఞాపకాలను కూడా గుర్తుచేసుకున్నారు. చిన్నతనంలో తాను తరచూ సౌతాంప్టన్‌లోని ఆలయానికి వెళ్లి వస్తుండేవాడినని చెప్పారు. అంతేకాదు, తన కుటుంబం తరుచూ పూజలు, హోమాలు చేస్తుండేదని.. అనంతరం, భక్తులకు తాము తీర్థప్రసాదాలు ఇచ్చేవాళ్లమని పేర్కొన్నారు. విశ్వాసం వ్యక్తిగతమని, అది తన జీవితంలోని ప్రతి అంశంలోనూ మార్గనిర్దేశం చేస్తుందని బ్రిటన్ ప్రధాని అన్నారు


అంతేకాదు, తనకు రాముడు ఎప్పుడూ స్ఫూర్తి అని చెప్పారు. ‘బాపు చెప్పిన రామాయణాన్ని కాకుండా భగవద్గీత, హనుమాన్ చాలీసాను కూడా స్మరించుకుంటూ నేను ఈ రోజు ఇక్కడికి బయలుదేరాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి వినయంతో పరిపాలించడానికి.. నిస్వార్థంగా పనిచేయడానికి రాముడు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయక వ్యక్తిగా ఉంటాడు’ అని తన ప్రసంగాన్ని యూకే ప్రధాని ముగించారు. రిషి సునాక్ వేదికపై హరతిలో పాల్గొన్నారు. పవిత్ర నైవేద్యంగా జ్యోతిర్లింగ సోమనాథ్ ఆలయం నుంచి తీసుకొచ్చి శివలింగాన్ని సునాక్‌కు మొరారీ బాపు బహూకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com