శ్రీకాకుళంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలో శనివారం అర్థరాత్రి కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్ళితే.... కలెక్టర్ బంగ్లా సమీపంలో ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇంటి నేతాజీ (51) అనే వ్యక్తి తన భార్య రూప, కుమార్తె కావ్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి భోజనం చేసిన తరువాత నేతాజీ తన ఇంటిలో నిద్రపోయాడు. పక్షవాతంతో బాధపడుతున్న ఓ మహిళకు తోడుగా.. నేతాజీ భార్య రూప, కుమార్తె కావ్య ఎదురింటిలో నిద్రపోయారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో భార్య, కుమార్తె ఇంటికి వచ్చి తలుపులు తెరిచేసరికి నేతాజీ విగతజీవిగా కనిపించాడు. దీంతో భార్య పోలీసులకు సమాచారం అందించింది. శ్రీకాకుళం డీఎస్పీ వై.శృతి, సీఐ ఎల్ఎస్.నాయుడు, టూటౌన్ ఎస్ఐ బలివాడ గణేష్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. నే తాజీ మెడపై కత్తిగాట్లు ఉన్నాయి. అలాగే, తల వెనుక, ముందు, కాళ్ల పై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దుండగులకు, నేతాజీకి కొంతసేపు పెనుగలాట జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.