పాఠశాలల్లో ఫోన్ల వాడకంపై జగన్ సర్కారు నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బడుల్లో ఫోన్ల వాడకంపై విద్యాశాఖ నిషేధం విధించింది. చాలా పాఠశాలల్లో విద్యార్థులు రహస్యంగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. దీంతో టీచర్లు చెప్పే పాఠాలను ఏకాగ్రతతో వినలేకపోతున్నారు. దీంతో విద్యార్థులు స్కూళ్లకు మొబైల్స్ తేకుండా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. టీచర్లు సైతం తరగతి గదుల్లోకి ఫోన్లు తేవొద్దని విద్యాశాఖ సూచించింది. క్లాస్‌లోకి వెళ్లే ముందే హెడ్ మాస్టర్ దగ్గర ఫోన్‌ను ఉంచాలని.. ఆ తర్వాతే పాఠాలు చెప్పేందుకు వెళ్లాలంటూ సరికొత్త నిబంధన విధించింది.
టీచర్లు క్లాసులు చెప్పే సమయంలో వచ్చిన ఫోన్ కాల్స్‌ను ఎత్తి మాట్లాడటం వల్ల విద్యా్ర్థులకు నష్టం చేకూరుతుంది. అటు టీచర్‌తోపాటు ఇటు విద్యార్థులు కూడా పాఠంపై పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టే అవకాశం ఉండదు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఆంక్షలు విధించామని విద్యా శాఖ ప్రకటించింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన టీచర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. స్కూల్ హెడ్మాస్టర్లు, ఆ పై స్థాయి అధికారులు మొబైల్ ఫోన్ నిబంధనను కచ్చితంగ పాటించాలని సూచించింది. పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకం వల్ల బోధనకు ఆటంకం కలుగుతుందని యూనెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ సైతం చెబుతోంది. దీంతో ఉపాధ్యాయులు బడిలో ఫోన్లు వాడే విషయంలో ఏపీ సర్కారు ఆంక్షలు విధించింది.
ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం కూడా తరగతి గదుల్లో ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. విద్యార్థులు స్కూళ్లకు ఫోన్లు తీసుకెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ తప్పనిసరై తీసుకెళ్లాల్సి వస్తే.. స్కూల్‌లోనే ఓ లాకర్ లాంటి ప్రదేశంలో భద్రపరిచే ఏర్పాట్లు చేయాలని సూచించింది. టీచర్లు కూడా స్కూల్లో ఫోన్లు వాడకుండా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠాలు చెప్పేటప్పుడు మాత్రమే కాకుండా.. ఆటస్థలాలు, లైబ్రరీ, ల్యాబొరేటరీల్లోనూ టీచర్లు ఫోన్లు వాడొద్దని సూచించింది. ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే కాకుండా ప్రయివేట్ స్కూళ్లలకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని కేజ్రీవాల్ సర్కారు స్పష్టం చేసింది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మీద ఫోకస్ పెట్టారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు. అమ్మ ఒడి ద్వారా ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లి్ష్ మీడియంలో విద్యా బోధన సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.