ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వాళ్ళు వారసులుగా చలామణి అవుతున్నారన్నారు లక్ష్మీపార్వతి. భార్యగా నాణెం అందుకోవడానికి అర్హత తనకే ఉందని.. వీళ్లకు లేదన్నారు. ప్రాణాలు తీసిన వాళ్ళు నాణెం విడుదలకు వెళ్లారని.. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌ను వాడుకుంటున్నారన్నారు. ఢిల్లీలో ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెంను విడుదల చేయగా.. ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తనను వివాహం చేసుకున్నారో లేదో.. ఆయన పిల్లలు సమాధానం చెప్పాలన్నారు. తనను పిలవకుండా పురందేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ భార్యను అని మెడలో ఫోటో పెట్టుకుని తిరగాలా.. ఆయనతో వివాహమైనట్లు ఫోటోలు, వార్తా కథనాలు ఉన్నాయన్నారు.
సాక్షాత్తూ ఎన్టీఆర్ అనేక సార్లు బహిరంగంగా చెప్పారని.. తనను పెళ్ళి చేసుకోలేదని టీడీపీ ప్రచారం చేస్తుందన్నారు. ఎన్టీఆర్ యుగ పురుషుడు అంటున్నారు.. పెళ్లి చేసుకోకపోతే యుగ పురుషుడు అవుతారా అని ప్రశ్నించారు. ఇంతకాలం ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో సైలెంట్‌గా ఉన్నానని.. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టనన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతానన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వీళ్లు రాజకీయాల్లో ఉండకుండా చేస్తానన్నారు. వీళ్ల గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తానన్నారు.
ఎన్నాళ్లూ వీళ్ల నుంచి అవమానాలు పడుతూ ఉండాలన్నారు. పురందేశ్వరి ఎందుకిలా చేస్తున్నారో తెలియడం లేదని.. తాను ఎందుకు అడ్డుగా వచ్చానో తెలియదన్నారు. ఎన్టీఆర్ కష్టాల్లో ఉంటే పురందేశ్వరి వచ్చారా అని ప్రశ్నించారు. తనను ఎందుకు చులకన చేస్తున్నారని.. తనను చులకన చేస్తే ఎన్టీఆర్‌ను చేసినట్టే అన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు బయటకి వెన్నుపోటుకు ఇంటర్నల్‌గా పురందేశ్వరి ప్రధాన కారకురాలని విమర్శించారు. పురందేశ్వరి రాజకీయాల్లోకి వద్దనడంతో ఎన్టీఆర్‌పై కుట్ర చేశారన్నారు. తండ్రిపై కోపంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారన్నారు.
ఇప్పుడు మళ్లీ బావామరదళ్ల ఏకమైపోయారని.. పురందేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేయడం ఏంటన్నారు. బీజేపీ ఈ విషయాన్ని గమనించి.. ఆమె కుట్రల్ని గమనించాలన్నారు. తనకంటే ఎక్కువ అవమానం పురందేశ్వరికి తప్పదన్నారు. భువనేశ్వరి, పురందేశ్వరిలు తండ్రికి ద్రోహం చేశారని.. కేంద్రం భారతరత్న ఇస్తానంటే పురందేశ్వరి అడ్డుకున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఆమె అవినీతి చేశారని.. ఈరోజు నుంచి ఆమెపై తాను పోరాటం చేస్తాన్నారు.. చంద్రబాబు, పురందేశ్వరిని ఇంటికి పంపిస్తానన్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందిందో లేదో తనకు తెలియదన్నారు లక్ష్మీపార్వతి. తారక్ ఢిల్లీ వెళితే చంద్రబాబుతో కలపాలని ప్రయత్నం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆహ్వానం అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యేవారన్నారు. ప్రైవేటు ఫంక్షన్ కనుకే ఆయన హాజరు కాలేదన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ పురందేశ్వరి చదువుతున్నారని.. సీఎం వైఎస్ జగన్‌కి వ్యతిరేకంగా భయంకర కుట్రలు చేస్తున్నారన్నారు. తాను రాసిన లేఖలను సమాధానం రాలేదని.. అందుకే ఢిల్లీ వెళ్లి ప్రధాని, రాష్ట్రపతి, నిర్మలా సీతారామన్‌లను కలుస్తాను అన్నారు.