టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 28 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యారని.. మూడుసార్లు సీఎంగా పని చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి పేరు చెబితే ఒక్క పథకమైనా కనిపిస్తుందా అన్నారు. సీఎం జగన్ చిత్తూరు జిల్లా నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను విడుదల చేశారు. ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందించారు. రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు.. అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తారన్నారు. చివరికి పిల్లనిచ్చిన మామను కూడా వెన్నుపోటు పొడిచారని.. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి.. ఆయన ఫొటోనే దండం పెడతాడు. ఎన్టీఆర్ నాణేం విడుదల కోసం ఢిల్లీ కూడా వెళ్లారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీలో సీఈసీని కలుస్తారట.. దొంగ ఓట్లు ఆయనే సృష్టించి.. మన మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారన్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లను తొలగిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ప్రతి అడుగు కుట్రలు, కుతంత్రాలేనన్నారు. రెచ్చగొట్టి గొడవలు పెట్టి.. శవరాజకీయాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశం. పుంగనూరులో కావాలనే పోలీసులపై రాళ్లు రువ్వించారని.. పోలీసులపై కర్ర, బీరు సీసాలతో దాడి చేయించారన్నారు. ఓ పోలీస్‌కన్ను కూడా పోగొట్టారన్నారు. పుంగనూరులో అల్లర్లు సృష్టించి పోలీసులపై దాడి చేశారని దుయ్యబట్టారు. ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పగలిగే వ్యక్తి ఎవరూ లేరని అన్నారు. సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదని.. అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నారన్నారు సీఎం జగన్.
చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు, మోసాలు. కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. అనుకూల మీడియా ద్వారా అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు సీఎం జగన్. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని.. ప్రజలకు నరకం చూపించారని అన్నారు. అప్పట్లో పాలన దోచుకో, పంచుకో తినుకో అన్న విధంగా ఉండేదని విమర్శించారు.
ప్రతి పేద కుటుంబానికి మంచి జరగాలనే ఆలోచన చేశామన్నారు ముఖ్యమంత్రి. తల్లిదండ్రుల పేదరికం పిల్లల భవిష్యత్తుకు అడ్డురాకూడదని.. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదనే విద్యా దీవెన తీసుకొచ్చామన్నారు. నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11 వేల మూడు వందల కోట్లు జమ చేశామన్నారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేశామన్నారు. అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థికి రూ, 15 వేల అందించామని తెలిపారు. స్కూళ్లు ప్రారంభించే నాటికే విద్యాకానుక అందిస్తున్నామన్నారు.
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని.. అలాగే విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో బోధన అందిస్తున్నామన్నారు. ఒకవేళ విద్యాసంస్థల్లో అక్రమాలుంటే 1902కు కాల్ చేయాలని తెలిపారు. నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామని.. మూడో తరగతి నుంచే సబ్జెట్ టీచర్‌తో పాఠాలు. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా ఇస్తున్నామన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నామని గుర్తు చేశారు. రోజుకో మెనూతో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం.. ప్రభుత్వ స్కూళ్లలో క్లాస్ రూమ్‌లను డిజిటలైజేషన్ చేశామన్నారు. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్. డిసెంబర్ నాటికి మరో 33 వేల క్లాస్‌రూమ్‌లు డిజిటలైజేషన్ చేయిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ పర్యటనలోనే నగరిలో సుమారు రూ.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.