విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం విశాఖలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. మంగళవారం ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసి.. అదుపులోకి తీసుకుని కేజీహెచ్‌కు తరలించారు. ఈ సమయంలో కేజీహెచ్ గేట్ వద్ద పోలీసులతో కేఏ పాల్ వాగ్వాదానికి దిగారు. వారితో దురుసుగా ప్రవర్తించిన ఆయన.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు వైద్యం అవసరం లేదని కేకలు వేశారు. తనను వదిలి పెట్టాలని ఆయన గందరగోళం సృష్టించారు.
ఆయనను అడ్డుకోబోయిన సీఐ రామారావు కాలర్ పట్టుకుని అమర్యాదగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులపై ఆరోపణలు చేశారు. పోలీసులు నా చేతులు,కాళ్లు విరగగొట్టారని, దీక్ష 24 గంటలు గడవకముందే భగ్నం చేశారని ఆరోపించారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని, తక్షణమే సిఐ రామారావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నా చావు కోసం ఈ రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ నష్టాల్లో లేదని,. నష్టాలు వచ్చేటట్లు చేస్తున్నారని పాల్ అన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయాలని సవాల్ విసిరారు.
మరోవైపు, స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలిపివేయాలంటూ ఆయన రెండు రోజుల కిందట అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చిన ఆయన.. ఢిల్లీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం నిరవధిక దీక్షకు దిగారు. తన అనుచరులతో కలిసి ఆశీల్‌మెట్ట సమీపంలోని ఫంక్షన్ హాలులో దీక్ష చేపట్టారు. ప్రయివేటీకరణ బిల్లు నిలుపుదల చేసే వరకు దీక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో రెండో రోజే పాల్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపుతోందని ఆరోపించిన పాల్... మనం కట్టిన పన్నులను గుజారత్ కు తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్క స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటే మన రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ తీరిపోతాయన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే పది లక్షల కోట్ల అప్పు తీరుస్తానని చెప్పారు. కాగా, ఈసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను ఆయన ముందే చెప్పేశారు. తాను పక్కా లోకల్ అని తాను పుట్టిన నేలకు సేవ చేస్తానని అంటున్నారు. రెండు రోజుల కిందట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను చంపేందుకు చూస్తున్నారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. అయినా సరే తాను స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతానని ఆయన చెప్పారు.