ప్రధాన మంత్రి భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చీఫ్ అరుణ్ కుమార్ సిన్హా (61) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సిన్హా.. గురుగ్రామ్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జార్ఖండ్‌కు చెందిన ఆయన 1987లో కేరళ కేడర్ నుంచి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 2016 మార్చి నుంచి ఆయన ఎస్పీజీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ బాధ్యతలు చేపట్టడానికి ముందు దాదాపు 15 నెలలపాటు ఆ పదవి ఖాళీగా ఉండటం గమనార్హం.
ఈ ఏడాది మే 31న ఎస్పీజీ డైరెక్టర్ జనరల్‌గా సిన్హా పదవీ కాలం పూర్తి కాగా.. వెంటనే ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కమిటీ మరో ఏడాదిపాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని బట్టి ప్రధాని మోదీకి సిన్హా పట్ల ఎంతటి నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. సిన్హా ఎస్పీజీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టక ముందు కేరళలోని తిరువనంతపురం సిటీ పోలీసు కమిషనర్‌గా, కొచ్చి సౌత్ జోన్ ఐజీగా పని చేశారు. వయనాడ్, మలప్పురం ఎస్పీగా, ఇంటెలిజెన్స్ డీఐజీగా, తిరువనంతపురం డీఐజీగా వ్యవహరించారు. బీఎస్‌ఎఫ్‌లోనూ వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. అరుణ్ కుమార్ సిన్హా మరణం పట్ల ఐపీఎస్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. విధి నిర్వహణ పట్ల ఆయన అంకిత భావం, అద్భుత నాయకత్వం ఎప్పటికీ మాకు స్ఫూర్తినిస్తుందని తెలిపింది.
1984లో ఇందిరాగాంధీ హత్యకు గురైన అనంతరం భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని, ఆయన/ఆమె కుటుంబీకులకు భద్రత కల్పించడం కోసం 1985లో ఎస్పీజీని ఏర్పాటు చేశారు. మొదట్లో ఎస్పీజీ ప్రధానులు, మాజీ ప్రధానులు, వారి కుటుంబీకుల భద్రతను పర్యవేక్షించేది. కానీ తర్వాత మాజీ ప్రధానులు, వాళ్ల కుటుంబీకుల భద్రత బాధ్యతల నుంచి ఎస్పీజీని మినహాయించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ భద్రతను మాత్రమే ఎస్పీజీ పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఎస్పీజీలో 3 వేల మంది భద్రతా సిబ్బంది పని చేస్తున్నారు. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్‌కు అధిపతిగా పని చేసిన షబ్తాయ్ షవిత్ (84) కూడా ఇదే రోజు కన్నుమూశారు. 1989 నుంచి 1996 మధ్య ఆయన మొసాద్ చీఫ్‌గా వ్యవహరించారు. జోర్డాన్‌తో శాంతి నెలకొల్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మరణానికి కారణాలు తెలియరాలేదు.