టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శిక్ష అనుభవించక తప్పదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రజల వద్ద సింపథీ పొందేందుకే అరెస్టు అంశంపై కొత్త ప్రచారం మొదలుపెట్టారని ఆయన విమర్శించారు. విషయాన్ని తప్పుదోవ పట్టించడం తప్పితే.. తాను తప్పు చేయలేదని చంద్రబాబు ఎందుకు చెప్పడంలేదని ఆయన ప్రశ్నించారు. మిత్రపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు. ‘కోట్ల రూపాయల లంచాలు దిగమింగి, ఐటీ శాఖకు అడ్డంగా దొరికిపోయి, తప్పించుకుతిరుగుదాం అనుకుంటున్న చంద్రబాబు నాయుడు.. చంద్రమండలానికి వెళ్లిపోయినా.. అరెస్టు చేస్తారు’ అని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఆయన శిక్ష అనుభవించక తప్పదని అన్నారు.
‘చంద్రబాబు నాయుడు అవినీతి బాగోతాన్ని జాతీయ పత్రికలు సైతం బయట పెట్టిన విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. 118 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు ఐటీ అధికారులకు దొరక్కుండా అర్థంపర్థం లేని మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్, సబ్ కాంట్రాక్టర్ మనోజ్ ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా చేసుకుని ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ‘సానుభూతి పొందడానికే తనను రెండు రోజుల్లో అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకు తిరుగుతున్నారు. తప్పు చేస్తే అరెస్టు చేయరా?’ అని అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 8) మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
‘చంద్రబాబు నాయుడు నిజంగా తప్పు చేయకపోతే.. వాంగ్మూలం ఇచ్చిన వారిద్దరినీ ఎందుకు దేశం దాటించాల్సి వచ్చింది? దుబాయ్‌కి, అమెరికాకు ఎందుకు పంపించాల్సి వచ్చింది? వారిచ్చిన వాంగ్మూలాలపై, చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదు? తాను తప్పు చేయలేదని బాహ్య ప్రపంచానికి ఎందుకు చెప్పడం లేదు?’ అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. ఎవరిని ఎక్కడికి పంపించినా, చంద్రబాబు నాయుడు తప్పించుకుతిరిగినా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తోడు దొంగలు ఎందుకు పెదవి విప్పడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి అమర్నాథ్. ‘మాట్లాడితే వైసీపీని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషిస్తున్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబు అవినీతి గురించి ఎందుకు నోరు విప్పడంలేదు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎందుకు దీనిపై స్పందించడంలేదు?’ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నలు సంధించారు.