శని, ఆది వారాల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్న భారత్ మండపంలో జరగనున్న జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు చేరుకున్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం రాత్రి 7 గంటలకు బైడెన్ దిగారు. దీంతో ఎయిర్‌పోర్టులో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్.. బైడెన్‌కు ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు బైడెన్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే బైడెన్ సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్‌కు కరోనా సోకడంతో ఆమె భారత్‌కు రాలేదు. బైడెన్‌తోపాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీకి చేరుకున్నారు.
ఎయిర్‌పోర్టు నుంచి జో బైడెన్ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు. అనంతరం మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ప్రయోజనాలకు సంబంధించి పలు కీలక అంశాలపై వారిద్దరూ చర్చలు జరపనున్నారు. జేఈ జెట్ ఇంజిన్ ఒప్పందం, అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు అంశంపై సమాలోచనలు జరపనున్నారు. వీటితోపాటు 5 జీ, 6 జీ స్పెక్ట్రమ్, అత్యాధునిక టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, అణు రంగంలో పురోగతి వంటి చాలా కీలకమైన అంశాలపై మోదీ, బైడెన్ కూలంకషంగా చర్చించనున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ ఇప్పటికే మీడియాకు తెలిపారు.
జో బైడెన్ కోసం ఢిల్లీలో ఉన్న ఐటీసీ మౌర్యాలో బసను సిద్ధం చేశారు. ఈ ద్వైపాక్షిక భేటీ పూర్తయిన తర్వాత బైడెన్ నేరుగా అక్కడికి చేరుకోనున్నారు. దీంతో ఐటీసీ మౌర్యాను ఇప్పటికే అమెరికా సీక్రెట్ సర్వీస్ కమాండోలు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఐటీసీ మౌర్యలోని 14 వ అంతస్తులో బైడెన్ బస చేసే గది ఉండగా.. అన్ని ఫ్లోర్లను కంట్రోల్‌లో ఉంచుకున్నారు. బైడెన్ ఉండే 14 వ ఫ్లోర్ చేరుకునేందుకు ప్రత్యేకంగా ఒక లిఫ్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ ఐటీసీ మౌర్య హోటల్లో 400 గదులను వివిధ దేశాల నుంచి వచ్చే అతిథుల కోసం బుకింగ్ చేశారు.