తమకు అధికార దాహం లేదని, అలాగే అవకాశవాద రాజకీయాలు చేయమని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ అన్నారు బీజేపీతో పొత్తుకు సై అని, ఎన్డీయేలో చేరడంపై దేవెగౌడ స్పందించారు. తమ పార్టీ లౌకిక ప్రమాణాలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మైనార్టీలను ఎన్నటికీ నిరాశపరచమని చెప్పారు. కర్ణాటకలోని రాజకీయ పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించామన్నారు. గత పదేళ్లలో తొలిసారి హోంమంత్రితో చర్చించినట్లు చెప్పారు. పార్టీని కాపాడుకునే లక్ష్యంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు.
బీజేపీతో పొత్తు ద్వారా తమ లౌకిక ప్రమాణాలను వదులుకునేది లేదన్నారు. యాభై ఏళ్ల రాజకీయ పోరాటంలో తమ పార్టీలో ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగలేదన్నారు. బీజేపీతో పొత్తు నిర్ణయానికి ముందు తమ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలతో పాటు మరికొందరు నేతలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. పదేళ్ల తర్వాత హోంమంత్రిని కలిసి చర్చించినట్లు చెప్పారు. ప్రధాని మోదీ బిజీగా ఉంటారని ఆయనను ఇబ్బంది పెట్టకూడదని కలవలేదని చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం పతనం కావడానికి కారణమెవరు? అని దేవెగౌడ ప్రశ్నించారు. రాహుల్ ఇక్కడకు వచ్చి తమను బీజేపీకి బీ-టీమ్ అంటారని, ఇది తనకు కాంగ్రెస్ ఇచ్చిన సర్టిఫికెట్ అన్నారు. దశాబ్దాలుగా ప్రజల కోసం పోరాడుతోన్న ఈ పార్టీని కాపాడుకోవాల్సి ఉందన్నారు. అంతే తప్ప అవకాశవాద రాజకీయాల కోసం, అధికార దాహంతో పొత్తు పెట్టుకోలేదన్నారు. తాము సంక్షోభంలో ఉన్నామని, పార్టీని కాపాడుకోవాలన్నారు.