రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతిదాహం పరాకాష్టకు చేరిందని టీడీపీ యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా అయన స్పందిస్తూ.... పాపపు సొమ్ము కోసం పసిపిల్లలు, బాలింతలకు ఇచ్చే పాలను సైతం కల్తీ చేస్తూ కాలకూట విషంగా మార్చారని నారా లోకేష్ అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటి వరకూ టెట్రా ప్యాకుల్లో సరఫరా చేస్తున్న పాలను తాజాగా సైకో జగన్ ముఖారవిందంతో లీటరు పాలిథిన్ ప్యాకెట్స్‌లో సరఫరా చేస్తున్నారన్నారు. ఈ నెల 3వతేదీన ప్యాక్ చేసినట్లుగా చెప్పబడుతున్న ఈ పాలప్యాకెట్లకు డిసెంబర్ 2వ తేదీ వరకూ ఎక్స్పైరీ డేట్ ఉన్నా... సరఫరా చేసిన రెండురోజులుకే గ్యాస్ బాంబుల్లా ఉబ్బి పేలిపోతున్నాయన్నారు. ఇవి చూశాక రక్తం రుచి మరిగిన మృగానికి, అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన జగన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోందన్నారు. ఉబ్బిపోయిన పాలపాకెట్లకు సంబంధించిన ఓ వీడియోను లోకేష్ తన ట్వీట్‌కు జత చేశారు.