ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రెండో రోజు కూడా అడిగిన ప్రశ్నలే అడిగారని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలు తనకు కానీ, తాను నిర్వహించిన శాఖకు కానీ ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వేస్తే హెరిటేజ్ కంపెనీకి ఉన్న భూములు దాని కింద పోతాయని నాకు ఇవాళే తెలిసింది. సీఐడీ అధికారులు ఒక సినిమా తయారు చేసి తీసుకొని వచ్చి నాకు చూపించారు. గూగుల్ ఎర్త్ మ్యాప్ మీద హెరిటేజ్ కంపెనీ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డును సూపర్ ఇంపోజ్ చేసి టీవీలో చూపించారు. ఆ ప్రకారం చూస్తే రింగ్ రోడ్డు హెరిటేజ్ భూముల్లో నుంచి పోతోంది. ఇప్పటి దాకా రింగ్ రోడ్డు హెరిటేజ్ భూముల పక్క నుంచి పోతోందని, దాని కోసం రోడ్డు దిశ మార్చారని ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు చూస్తే ఆ రోడ్డు ఏకంగా కంపెనీ భూముల మీద నుంచి పోతుండటం కనిపించింది’’ అని ఆయన చెప్పారు.