రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై బుడబుక్కల సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల రోజా మాట్లాడుతూ తమ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని.. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితం కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి రోజా రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బుడబుక్కల వాళ్లంటూ వ్యాఖ్యలు చేశారని.. తమ కులాన్ని కించపరిచే హక్కు ఆమెకు ఎవరిచ్చారంటూ ఆ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కులాన్ని కించపరిచిన రోజా బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రోజాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెనుగంచిప్రోలు బుడబుక్కల సంఘం అధ్యక్షుడు ఎర్ర అబ్బాయి ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి రోజా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను విమర్శించే క్రమంలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను విమర్శిస్తూ.. ఇద్దర్ని బుడబుక్కల వారితో పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో బుడబుక్కల సంఘం మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు, అనంతరం వివాదంపై మంత్రి స్పందించాల్సి ఉంది.