ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాలో అతిపెద్ద శరణార్ధ శిబిరంపై ఇజ్రాయేల్ దాడి,,,తీవ్రంగా ఖండించిన అంతర్జాతీయ సమాజం

international |  Suryaa Desk  | Published : Sun, Nov 05, 2023, 10:57 PM

హమాస్‌ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా గత 28 రోజుల నుంచి గాజా నగరంపై ఇజ్రాయేల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలో శరణార్థి శిబిరాలు, ఆస్పత్రులపై కూడా దాడులు చేయడం పట్ల అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఒకరమైన యుద్ధ నేరాలేనని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. శరణార్థ శిబిరంపై జరిగిన దాడిలో డజన్లు కొద్దీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం గాజాలోని ప్రధాన ఆసుపత్రి అల్‌-షిఫా ప్రాంగణంపై రాకెట్లను ప్రయోగించింది. దీంతో అంబులెన్సు వాహనశ్రేణి ఛిద్రమైంది. అంతర్జాతీయ సమాజం వ్యతిరేకత కూడా లెక్కచేయకుండా ఇజ్రాయేల్‌ విచక్షణరహితంగా వ్యవహరించడంపై అమెరికా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ రెండు ఘటనలపై వివరణ ఇవ్వాలని ఇజ్రాయేల్‌‌ను అమెరికా ప్రభుత్వం కోరినట్టు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. శరణార్థి శిబిరంపై దాడి వెనక ఆలోచన ఏంటని ప్రశ్నించినట్లు తెలిపింది. ప్రాణనష్టం లేకుండా లక్ష్యాలపై గురిచూసి దాడి చేయాలని కోరినట్లు అమెరికా అధికారిని ఉటంకిస్తూ కథనంలో రాసుకొచ్చింది. బైడెన్ యంత్రాంగం అధికారి పొలిటికోతో మాట్లాడుతూ.. ‘జబాలియాపై జరిగిన మొదటి దాడి గురించి అమెరికా వివరణ కోరింది’ అని అన్నారు.


మరోవైపు, ఇజ్రాయేల్‌ మాత్రం జబాలియా( గాజాలోనే అతిపెద్ద శిబిరం)పై జరిపిన దాడిలో ఇద్దరు హమాస్‌ కీలక నేతలు హతమైనట్లు ప్రకటించింది. తాను హమాస్‌ మిలిటెంట్లు, ఆయుధాగారాలు, సొరంగాలు, డ్రోన్లు లాంఛింగ్ ప్రాంతాలు, కమాండ్ కేంద్రాల లక్ష్యంగానే దాడులు చేస్తున్నట్లు చెబుతోంది. మరోవైపు, పాలస్తీనా పౌరుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, మానవతాసాయానికి వీలుగా తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని అమెరికా చేసిన సూచనలను ఇజ్రాయేల్‌ తిరస్కరించింది.


బందీలుగా ఉన్నవారందరినీ హమాస్ విడిచిపెడితేనే విరమణ సాధ్యమవుతుందని ఇజ్రాయేల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తెగేసి చెప్పారు. ఇజ్రాయేల్‌ దాడుల్లో ఇప్పటి వరకూ 9 వేల మందికిపై పౌరులు మృతి చెందగా.. వీరిలో దాదాపు 4 వేల మంది చిన్నారులు ఉన్నారు. మరోవైపు, మధ్య ఆసియాలో పర్యటిస్తోన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకేన్.. జోర్డాన్‌లో అరబ్ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. అంతకు ముందు ఇజ్రాయేల్‌లో పర్యటించిన ఆయన.. బెంజిమిన్ నెతన్యాహును కలిసి కాల్పుల విరమణపై పునరాలోచించాలని కోరారు.


మరోవైపు, ఇజ్రాయేల్ దాడులను ఐక్యరాజ్యసమతి తీవ్రంగా ఖండిస్తోంది. ఘోరమైన దాడులు యుద్ధ నేరాలకు సమానం అని ఐరాస ఆరోపించింది. జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయేల్ రాకెట్ దాడుల తర్వాత అధిక సంఖ్యలో ప్రాణ నష్టం, విధ్వంసం స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే ఇవి యుద్ధ నేరాలకు దారితీసే అసమాన దాడులని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com