డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాలో అందర్నీ హడలెత్తించిన మొసలి ఎట్టకేలకు చిక్కింది. విశాఖ జూ అధికారులు, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేసి మొసలిని పట్టుకున్నారు. సెప్టెంబర్ నెలలో స్థానిక బొబ్బర్లంక ప్రాంతంలో ఈ మొసలి స్థానికుల కంటపడింది. సెప్టెంబరు 21న బొబ్బర్లంక ప్రధాన పంట కాలువలో మొసలి కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నీటి ప్రవాహ వేగానికి కింది ప్రాంతమైన నడిపూడి లాకుల దగ్గరకు చేరుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. అక్కడి నుంచి సమనస లాకుల వద్దకు చేరుకుని అక్కడే తిష్ట వేసినట్లు ఆధారాలు లభించాయి. గత పది రోజులుగా సమనస లాకుల ప్రాంతంలోనే ఉంది.. రాత్రి వేళల్లో రోడ్డుపైకి రావడంతో స్థానికులకు పంటకాల్వలో కనిపించింది. వెంటనే స్థానికులు ఈ విషయాన్ని అధికారులకు చెప్పారు. ఈ క్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి ఎంవీ ప్రసాదరావు సూచనల మేరకు విశాఖపట్నానికి చెందిన జూ వైద్యుడు డాక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.
మొసలిని పట్టుకునే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పంటకాల్వలో నీటి మట్టాన్ని తగ్గించి.. మొసలి ఎటూ వెళ్లకుండా ఎక్కడికక్కడ వలలు ఏర్పాటు చేశారు. ముందు ప్రతీ 15 నిమిషాలకు ఒకసారి ప్రధాన పంట కాల్వలో తల పైకెత్తి ఊపిరి తీసుకుని మళ్లీ లోనికి వెళ్లిపోయేది. విశాఖ నుంచి వచ్చిన సిబ్బంది మొసలిని పట్టుకునేందుకు వేట ప్రారంభించగానే ఆ మొసలి కనిపించడం మానేసింది. అయితే డాక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో ఇక మొసలి కనిపించగానే మత్తు ఇచ్చేందుకు ప్రత్యేకంగా గన్‌ను సిద్ధం చేశారు. అయినా మొసలి జాడ తెలియలేదు. అయినా సరే మొసలి కోసం గాలింపునుకొనసాగించారు. ఎట్టకేలకు గురువారం 6 గంటల సమయంలో.. అమలాపురం-చల్లపల్లి ప్రధాన పంటకాల్వలో సమనస లాకుల వద్ద స్థానికులు ఏర్పాటు చేసిన వలలో మొసలి చిక్కుకుంది. వెంటనే రెస్క్యూ బృందం చాకచక్యంగా మొసలిని బయటకు తీశారు. మొసలిని ఈదరపల్లిలోని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి విశాఖ జూకు తరలిస్తారా.. అటవీ ప్రాంతంలో వదిలేస్తారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. కొంతకాలంగా జనాల్ని వణికించిన మొసలి దొరకదడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.