వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్ర బుస్సు యాత్రగా మారిందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనబడింది కాబట్టే మూడు సార్లు యాత్రకు బ్రేక్ వేశారన్నారు. 33 మంది బీసీలను ఊచకోత కోయించి కేసులు లేకుండా చేసినప్పుడు జగన్ రెడ్డికి బీసీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బీసీలను దగా చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మండిపడ్డారు. బీసీలకు నాయకత్వం వహించే ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు- పవన్ కలిశాక జగన్‌కు పులివెందులలోను ఓటమి భయం పట్టుకుందన్నారు. జగన్‌హన్ రెడ్డి దమ్ము ధైర్యం లేని పిరికిపంద కాబట్టే 10 నెలల క్రితం ఘటనలో ఇప్పుడు బీటెక్ రవిని అరెస్టు చేయించారని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి జాతకం బాలేదు కాబట్టే చంద్రబాబు జోలికి వచ్చారన్నారు. చంద్రబాబు రాశిఫలం బాలేదన్న కేశినేని నాని వ్యాఖ్యలను ఖండిస్తున్నానని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.