ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో విషాద ఘటన జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ అధికారి గుండెపోటుతో కన్నుమూశారు. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వంగూరి వెంకట శివరామప్ప పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వచ్చారు. దర్శనం అనంతరం ఆయనకు ఒక్కసారిగా గుండెనొప్పి రావడంతో దేవస్థానం ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లి వైద్య సేవలందించారు.
అయినా శివరామప్పకు గుండెనొప్పి తగ్గకపోవడంతో వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆయన మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని దేవస్థానం అంబులెన్స్‌లో స్వగ్రామం పిఠాపురానికి తరలించారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. దేవుడి దర్శనానికి వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. కరోనా తర్వాత పరిస్థితులు మారాయి.. గుండెపోటుతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నవారు కూడా ఉన్నట్టుండి కుప్పకూలి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు.