పశ్చిమ గోదావరి జిల్లా, ముసునూరు బీసీ కాలనీలో సోమవారం దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... వ్యవసాయ కూలీ అయిన తలకొండ కృష్ణకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడైన ఆదర్శ్(3) ఆడుకుంటూ ఇంటి వద్ద నేలకు సమాంతరంగా ఉన్న ఏడడుగుల లోతున్న వరల నీటితొట్టెలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. అయితే ఇంటి లోపల చంటిపిల్లవాడి వద్ద ఉన్న తల్లి వచ్చేసరికి ఆదర్ష్ నీటి తొట్టెలో మునిగిపోయి ఉన్నాడు. వెంటనే ఆమె తొట్టెలోకి దిగి కుమారుడిని బయటకు తీసే సరికే మృతి చెంది ఉన్నాడు. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకున్న కుమారుడు విగతజీవుడిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.