ఇటీవలి కాలంలో వైజాగ్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన షాకింగ్ సంఘటనలలో ఒకటి ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం. నవంబర్ 19 రాత్రి విశాఖపట్నం జెట్టీలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించి 30కి పైగా మత్స్యకారుల నౌకలు దగ్ధమయ్యాయి. ఇక ఈ కేసులో "నాని" పేరు బలంగా వినిపించడంతో ప్రముఖ యూట్యూబర్ 'లోకల్ బోయి నాని'ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే ఇప్పుడు ట్విస్ట్.
బోటులో మద్యం సేవిస్తున్న వాసుపల్లి నాని(23), అతని మామ అల్లిపిల్లి సత్యం ఈ ఘటనకు కారణమని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. నాని నిర్లక్ష్యంగా సిగరెట్ పీకను పక్కనే ఉన్న పడవలోని నైలాన్ ఫిషింగ్ నెట్‌పైకి విసిరి మంటలను రేకెత్తించాడు. తీవ్రత ఉన్నప్పటికీ, ఇద్దరూ పారిపోయి ఇంటికెళ్లి నిద్రపోయారు, ఈ నేపథ్యంలో ఈ ఘటన వెనుక యూట్యూబర్ 'లోకల్ బోయి నాని' కాదని, ఇప్పుడు అరెస్టయిన మరో నాని అని పోలీసులు స్పష్టం చేశారు.
ఇంటెన్సివ్ విచారణ తరువాత, పోలీసులు నానిపై ఐపీసీ సెక్షన్లు 437, 428, 285 కింద అభియోగాలు మోపారు. కీలకమైన సాక్ష్యాలలో నాని జెట్టీ నుండి పారిపోతున్నట్లు చూపించే ఫుటేజ్ ఆధారంగా నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో దాదాపు 30 ఫిషింగ్ బోట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 18 పాక్షికంగా దగ్ధం అయ్యాయి. దీంతో దాదాపు రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది.