రైల్వే శాఖలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని కాగ్ ఎత్తిచూపింది. గత సంవత్సరం డిసెంబరులో కాగ్ విడుదల చేసిన మరో నివేదిక ఏం చెప్పిందంటే….రైల్వేలో భద్రత కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం 2017లో రాష్ట్రీయ రైల్ సంరక్ష కోశ్ (ఆర్‌ఆర్‌ఎస్‌కే) పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. అయితే రైల్వేలో భద్రత కోసం ఉద్దేశించిన ఈ నిధి పక్కదారి పట్టింది. ఈ నిధిని ఫుట్ మసాజర్లు, పాత్రలు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫర్నీచర్, చలి కోట్లు, కంప్యూటర్లు, ఎస్కలేటర్ల కొనుగోలుకు వినియోగించారు.
అంతేకాదు…పూల తోటల అభివృద్ధికి, మరుగుదొడ్ల నిర్మాణానికి, జీతాలు, బోనస్‌ల చెల్లింపునకు, చివరికి జెండాల ఏర్పాటుకు కూడా ఖర్చు చేశారు. ప్రతి సంవత్సరం ఈ నిధికి రూ.20 వేల కోట్లు జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు, రైల్వే ఆదాయం నుండి రూ.5 వేల కోట్లు జమ చేస్తారు. అయితే గడచిన నాలుగు సంవత్సరాల కాలంలో రైల్వే శాఖ తన వాటాగా కేవలం రూ.4,225 కోట్లు మాత్రమే సమకూర్చింది. దీంతో రూ.15,775 కోట్ల లోటు ఏర్పడింది.