దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపడుతున్న ‘యువగళం’ పాదయాత్ర తిరిగి ప్రారంభమయ్యింది. పూర్వ తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి సోమవారం (నేడు) ఉదయం 10.19 నిమిషాలకు లోకేశ్ మొదలుపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధమవ్వగా.. లోకేశ్ ఆదివారం సాయంత్రమే ఈ ప్రాంతానికి చేరుకున్నారు. కాగా మొదటి రోజు షెడ్యూల్‌ను పార్టీ ఆదివారం రాత్రి విడుదల చేసింది. పున:ప్రారంభ మొదటి రోజున ఉదయం 10.19 గంటలకు ప్రారంభమై 11.20 గంటలకు తాటిపాక, 12.35 గంటలకు నాగారం, మధ్యాహ్నం 2 గంటలకు మామిడికుదురు, 4.30 గంటలకు అప్పన్నపల్లి, సాయంత్రం 5.30 గంటలకు అమలాపురం, 6.30 గంటలకు బోడసకుర్రు, రాత్రి 7.30 గంటలకు పేరూరు చేరుకుంటుందని టీడీపీ ప్రకటించింది.
కాగా యువగళం పున:ప్రారంభానికి టీడీపీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. లోకేశ్ ఆదివారం సాయంత్రమే పాదయాత్ర ప్రారంభించనున్న ప్రాంతానికి చేరుకున్నారు. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కారణంగా యువగళం పాదయాత్ర సెప్టెంబర్ 9న తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 209 రోజుల్లో 2852 కిలోమీటర్ల పాదయాత్రను లోకేశ్ పూర్తి చేశారు. మరోవైపు లోకేశ్ యువగళంలో ఈసారి జనసేన శ్రేణులు కూడా పాల్గొననున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించిన నేపథ్యంలో యువగళం యాత్రకు జనసేన నేతలు మద్దతు తెలపనున్నారు.