దేశంలోని యువతరం వారానికి కనీసం 70 గంటల పాటు పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు డాక్టర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించినప్పటి నుండి దేశంలో దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. భారతీయ కార్మికులకు క్రమశిక్షణ లేదని, కొరడా ఝుళిపిస్తేనే వారు పని చేస్తారని ప్రముఖులు తరచూ చెబుతుంటారు. నారాయణ మూర్తి మాటలు వారికి సంతోషం కలిగించి ఉంటాయి. ప్రపంచ యుద్ధాల తర్వాత యూరప్‌లో కార్మికులు ఎక్కువ గంటలు పని చేయడం వల్లనే కోల్పోయిన సంపదను తిరిగి సొంతం చేసుకోగలిగిందని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. చైనా వంటి అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రాలతో పోటీ పడాలంటే యువ కార్మికులు శ్రమ పడాలని, ఎక్కువ గంటలు పని చేయాలని ఆయన ఉద్బోధించారు.
అధిక ఉత్పత్తికి, ఎక్కువ పని గంటలకు లంకె పెట్టడం చాలా సులభం. పారిశ్రామిక ఉత్పత్తి ద్వారా జాతి నిర్మాణం జరగాలంటే కార్మికులు ఎక్కువ గంటలు పని చేయాలని చెబుతుంటారు. అయితే పురుషులతో పోలిస్తే మహిళలు అలా అధిక సమయం పని చేయడం చాలా కష్టం. వారి వేతనాలు కూడా తక్కువగా ఉంటాయి. ఫ్యాక్టరీలలో, పారిశ్రామిక ఉద్యోగాలలో పని చేసే మహిళలు ఎంతగా శ్రమ పడినప్పటికీ ఓ మహిళగా వారి పని అనుభవాన్ని గురించి ఎవరూ సంప్రదించరు.