బెంగళూరులోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేగుతోంది. నగరంలోని 44 పాఠశాలలకు శుక్రవారం మెయిల్స్ పంపిన గుర్తుతెలియని వ్యక్తులు... భవనాలను బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను ఖాళీ చేయించి ఇళ్లకు పంపేశారు. అనంతరం ఆయా పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే, ఇది ఆకతాయిల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తొలుత బసవేశ్వర్ నగర్‌లోని నేపెల్, విద్యాశిల్ప సహా ఏడు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపు మెయిల్స్ పంపారు. ఈ పాఠశాలల్లో ఒకటి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి ఎదురుగా ఉంది. కొద్దిసేపటికి అనేక విద్యా సంస్థలకు ఇ-మెయిల్ ద్వారా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు.. భద్రతా చర్యల్లో భాగంగా పాఠశాలల నుంచి విద్యార్థులు, సిబ్బందిని ఖాళీ చేయించారు. బాంబు బెదిరింపులు బూటకమని సంకేతాలు ఉన్నప్పటికీ.. పోలీసులు బాంబు నిర్వీర్య స్క్వాడ్‌ల సహాయంతో క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. ఏ పాఠశాలలోనూ బాంబులు ఉన్నట్లు వారు ఇంకా ధ్రువీకరించలేదు. గత సంవత్సరం బెంగళూరులోని చాలా పాఠశాలలకు ఇలాంటి ఇ-మెయిల్ బెదిరింపులు వచ్చాయి. అయితే నకిలీవని తేలింది.
బెంగళూరు నగర కమిషనర్ దయానంద్ మాట్లాడుతూ.. అనేక బాంబు నిర్వీర్య బృందాలు పాఠశాల ప్రాంగణాన్ని స్కాన్ చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకూ వారికి ఎటుంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని ఆయన పేర్కొన్నారు.
‘ప్రస్తుతానికి ఇది బూటకపు మెయిల్‌లా కనిపిస్తోంది. త్వరలో సెర్చ్ ఆపరేషన్ పూర్తి చేస్తాం. అయితే, తల్లిదండ్రులు భయాందోళన చెందవద్దని మేం కోరుతున్నాం’ అని ఆయన అన్నారు. గతేడాది కూడా నగరంలోని చాలా పాఠశాలలకు దుర్మార్గులు ఇలాంటి ఇమెయిల్‌లు పంపారని వివరించారు. ఈ పరిణామంపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భద్రతపరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ‘ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు ఆదేశించాను.. పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టాం.. పాఠశాలల్లో తనిఖీలు చేపట్టి, భద్రతను పెంచాలని పోలీసులకు సూచించాను.. పోలీసుల నుంచి ప్రాథమిక నివేదిక అందనుంది’ అని సిద్ధూ తెలిపారు.
అటు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసిన కొన్ని పాఠశాలలు, మా ఇంటి దగ్గర ఉన్న పాఠశాలల గురించి టీవీలో వార్తలు చూసిన తర్వాత నేను నిరుత్సాహానికి గురయ్యాను.. తనిఖీ చేయడానికి బయటకు వెళ్లాను.. పోలీసులు మెయిల్ చూపించారు. ప్రాథమికంగా చూస్తే, ఇది బూటకమని తెలుస్తోంది. నేను పోలీసులతో మాట్లాడాను, ప్రస్తుతం వారు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు, కానీ పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారు’ అని వివరించారు.