అగ్రదేశాలన్నీ ఇపుడు జనాభా పెంపుపై పడ్డాయి. ఇటీవల రష్యా రాజధాని మాస్కో నగరంలో వరల్డ్ రష్యన్ పీపుల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాలో పెద్ద కుటుంబాలు ఏర్పడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి మహిళ 8 కంటే ఎక్కువమంది పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. 1990 నుంచి రష్యాలో జననాల రేటు క్షీణించిందని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ పై దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 3 లక్షలకు పైగా ప్రాణనష్టం జరిగిందని వివరించారు. ఇకపై రష్యా జనాభాను పెంచడమే ప్రతి మహిళకు లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మునుపటి తరం వారు ఐదుగురు పిల్లలను కూడా కనేవారని, అందువల్లే రష్యన్ సమాజం బలంగా ఉందని తెలిపారు. వారి కంటే ముందు తరానికి చెందిన వారు ఎనిమిది మంది పిల్లలను కూడా కనేవారని పుతిన్ వివరించారు. భవిష్యత్ తరాలకు జనాభా పెంచడం, పెద్ద కుటుంబాలను ఏర్పరచడం అనేది ప్రామాణికంగా ఉండాలని నిర్దేశించారు. రష్యా జనాభా ప్రస్తుతం 14.44 కోట్లు అని ప్రపంచ నివేదికలు వెల్లడిస్తున్నాయి.