పల్నాడు జిల్లాలో విచిత్రమైన ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా నడిరోడ్డుపై అడ్డుగా గోడ కట్టేశాడు. శావల్యాపురం మండలం కారుమంచిలో ఓ ఇంటి యజమాని ఎదురింటి వారితో గొడవపడి నడిరోడ్డుపై గోడ నిర్మించారు. ఈ వ్యవహారం స్థానికంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. కారుమంచికి చెందిన కిలారు లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్‌కు చెందిన ఇళ్లు ఎదురెదురుగా ఉంటాయి. వీరిళ్ల మధ్యలో సీసీ రోడ్డు ఉంది.. అయితే లక్ష్మీనారాయణ రోడ్డు మీదకు వచ్చేలా గతంలో మెట్లు కట్టాడని చంద్రశేఖర్ అభ్యంతరం తెలిపారు.
ఈ మెట్ల వివాదంపై అప్పట్లోనే గ్రామంలో ఉండే పెద్దలు, పోలీసులు, పంచాయతీ సిబ్బంది ఇద్దరికీ రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ ఇటీవల తన ఇంటి ఎదుట మురుగు కాలువపై మెట్లు కట్టారు. దీనికి నిరసనగా లక్ష్మీనారాయణ ఏకంగా ఇంటి ముందున్న రోడ్డు మధ్యలో సిమెంటు ఇటుకలతో గోడ నిర్మించారు. దీనిపై పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని చంద్రశేఖర్ అంటున్నారు. ఇలా నడిరోడ్డుపై గోడ కట్టడంతో ఇప్పుడు మరో వివాదం రేగింది. అందరూ వెళ్లే రోడ్డుపై ఇలా గోడ కట్టడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు వ్యవహారంపై స్పందించాల్సి ఉంది.