నెల్లూరు జిల్లా మైపాడు - రామతీర్ధం మధ్య భూ ప్రాంతాన్ని టచ్ చేసి మీచౌంగ్ తుఫాను ముందుకు సాగింది. ఈదురు గాలులు, భారీ వర్షాలు జిల్లాని కుదిపేశాయి. జిల్లాకి రూ.వందల కోట్ల అపారనష్టం వాటిల్లింది. వందల ఎకరాల పొలాలు నీటమునిగాయి. చెట్లు, హోర్డింగులు, విద్యుత్తు స్తంబాలు నేలకొరిగాయి. గడిచిన 24 గంటలుగా గాడంధకారంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉండిపోయింది. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. రాకపోకలు పలు ప్రాంతాలకి నిలిచిపోయాయి. నెల్లూరు నుంచి చెన్నైకి రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కైవల్య, స్వర్ణముఖి, కాళంగి నదులు, పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.