మిజోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం ) అధ్యక్షుడు లాల్దుహౌమా మిజోరం ముఖ్యమంత్రిగా 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం రానున్న 100 రోజులకు సంబంధించి ప్రాధాన్య ప్రాజెక్టులను ప్రకటిస్తామని లాల్దుహౌమా తెలిపారు. ప్రమాణ స్వీకారం రోజున ఎమ్మెల్యేలతో తమ నివాసంలో సమావేశం కానున్నట్టు వెల్లడించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఆర్థికపరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. ఎంఎన్‌ఎఫ్ నుంచి అధికారాన్ని స్వీకరించినప్పటికీ.. తమ నిబద్ధతను చూపుతామని చెప్పారు. తమది రైతు ప్రభుత్వమని, వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. కనీస మద్దతు ధర ప్రకటించామని చెప్పారు. ఎంపిక చేసిన నాలుగు వస్తువులైన అల్లం, పసుపు, మిర్చి, చీపురు కర్రలను మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ.. ప్రజలకే ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
ఆర్థిక పునరుద్ధరణ కోసం నిపుణులతో వనరుల సమీకరణ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిటీ పొదుపు చర్యలు, పెట్టుబడి చర్యలు, మానవ వనరుల అంచనా తదితర అంశాలను పర్యవేక్షిసుందని అన్నారు. ఆ తర్వాత, అవినీతి నిరోధక చర్యలకు ప్రధాన ప్రాధాన్యతనిస్తామని ప్రకటించారు. అవినీతిని పారద్రోలడంతో కొత్త ప్రభుత్వాన్ని ప్రారంభిస్తామని అన్నారు.
ఇటీవల జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గానూ జెడ్‌పీఎం 27 నియోజకవర్గాల్లో గెలుపొంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. జెడ్‌పిఎం ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్దుహౌమా, సెర్చిప్ నియోజకవర్గంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్)కి చెందిన జె. వచాంగ్‌పై 8,314 ఓట్ల తేడాతో విజయం సాధించారు.