ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయంలో కాంగ్రెస్‌ తప్పుచేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2023, 03:14 PM

పాక్‌ అక్రమిత కాశ్మీర్‌ భారత్‌ చేజారిపోవడానికి కాంగ్రెస్‌ అయిదు చారిత్రక తప్పులు చేసిందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. నెహ్రూ అవలంభించిన బూటకపు సెక్యులరిజమ్‌ కారణంగానే కాశ్మీర్‌ సమస్య అనేక దశాబ్దాలపాటు రావణకాష్టంలా రగులుతూ వచ్చింది. 50 ఏళ్ళ పాలనలో జమ్మూ, కాశ్మీర్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు వచ్చిన అవకాశాలన్నింటినీ కాంగ్రెస్‌ పార్టీ జార విడిచింది. 1947 జూలైలో కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తానని అప్పటి కాశ్మీర్‌ అధిపతి మహరాజా హరి సింగ్‌ చేసిన ప్రతిపాదనను ఆమోదించకుండా నెహ్రూ తటపటాయించారు. నెహ్రూ ఉదాశీనతను ఆసరాగా చేసుకుని తదనంతరం పాకిస్తాన్‌ కాశ్మీర్‌పై దాడికి తెగబడింది. ఇది కాంగ్రెస్‌ చేసిన మొట్టమొదటి చారిత్రక తప్పిదం. భారత సైన్యం శ్రీనగర్‌ను స్వాధీనం చేసుకుని పాకిస్తాన్‌ సైన్యాన్ని కాశ్మీర్‌లోని ఇతర భూభాగం నుంచి తిప్పికొడుతున్న తరుణంలో నెహ్రూ భారత సైన్యం ముందుకు పోకుండా నిలవరించారు. ఎవరిని రక్షించేందుకు, ఎవరి మెప్పు పొందేందుకు ఆయన ఆ పని చేశారో తెలియదని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. కాశ్మీర్‌ సమస్యను ఐక్యరాజ్య సమితికి తీసుకువెళ్ళడం నెహ్రూ చేసిన రెండవ తప్పిదం. ఈ తప్పిదమే 1949లో రాజ్యాంగంలో ఆర్టికల్‌ 370 ప్రవేశపెట్టడానికి కారణం అయింది. ఆర్టికల్‌ 370 కారణంగా జమ్మూ, కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసే ప్రక్రియకు తీవ్ర అవరోధంగా నిలిచింది. ఇక 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌ స్వాధీనం చేసుకునేందుకు మరో అవకాశం చిక్కింది. ఆ యుద్ధంలో భారత సైన్యం లాహోర్‌ వరకు చొచ్చుకుపోగలిగినా పీవోకేను మాత్రం తిరిగి పొందలేక పోయింది. అలాగే 1971 బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధం అనంతరం కూడా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్‌తో సంప్రదింపులు జరిపే అవకాశం దొరికింది. సిమ్లా ఒప్పందంలో ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టడానికి పాకిస్తాన్‌ సిద్ధం అయినప్పటికీ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. చేతికి అందిన పీవోకేను కాంగ్రెస్‌ పార్టీ బంగారు పళ్ళెంలో పెట్టి పాకిస్తాన్‌కు అప్పగించిందని శ్రీ విజయసాయి రెడ్డి విమర్శించారు. జమ్మూ, కాశ్మీర్‌ విషయంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలను ఇప్పటి బిజెపి ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అనారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అనుసరించిన రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు, రెండు గుర్తులకు బదులుగా ఒకే విధానం, ఒకే ప్రధాని, ఒకే గుర్తు విధానం అమలులోకి వచ్చిందని అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూ, కాశ్మీర్‌లో గడచిన నాలుగేళ్ళలో గణనీయమైన మార్పులు సంభవించాయి. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. జిల్లా అభివృద్ధి మండళ్ళ ద్వారా అధికార వికేంద్రీకరణ జరిగింది. ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజి కింద కొత్త ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టారు. టూరిజం, పెట్టుబడులు, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనంపై పెట్టిన దృష్టి వలన ఆర్థిక రంగం శక్తి పుంజుకుంటోందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శ్రీ విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవోకే) ప్రాంతానికి కేటాయించిన 24 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. అందువలన పీవోకే పాలన చేతికి వచ్చే వరకు దానికి కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాలను నామినేషన్‌ ప్రాతిపదికపై భర్తీ చేయాలని సూచించారు. అలాగే కాశ్మీర్‌ నుంచి వలస వచ్చిన కాశ్మీరీ పండిట్ల కుటుంబాలకు నెలకు ప్రస్తుతం ఇస్తున్న 13 వేల రూపాయల భత్యాన్ని 20 వేల రూపాయలకు పెంచాల్సిందిగా శ్రీ విజయసాయి రెడ్డి హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com