చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో సహా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ గెలుపు ఖాయమైందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ ఇంఛార్జ్ ల మార్పుపై టీడీపీ-జనసేన పార్టీలు చేసిన విమర్శలకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ- జనసేన పార్టీలు ముందు వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకోవాలి అని ఆయన చురకలంటించారు. ఎక్కడ పోటీ చేయాలో.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో.. వాళ్ళకు ఇప్పటికీ స్పష్టత లేదు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మార్పులు చేర్పులు అన్ని అంతర్గత వ్యవహారం.. 2014లో చంద్రబాబు చేసిన తప్పుడు పనులు జనం మర్చిపోయారు అనుకుంటున్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.