పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ సంచలన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ఆగంతకులు ఏకంగా లోక్‌సభలోకి చొరబడటం దేశవ్యాప్తంగా పెను దుమారానికి కారణం అయింది. కలర్ గ్యాస్ బాంబులను లోక్‌సభలో వదలడం తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని.. దాని పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు వేయిస్తామని ఓం బిర్లా హామీ ఇచ్చారు. దానికి పూర్తి బాధ్యత తనదేనని వెల్లడించారు.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో జీరో అవర్ జరుగుతుండగానే ఇద్దరు దుండగులు దూసుకొచ్చి ఎంపీలు కూర్చునే సోఫాలపై నుంచి దూకడం తీవ్ర కలకలం రేపింది. అనంతరం సభ వాయిదా పడగా.. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం అయింది. దీంతో సభలో ఉన్న ఎంపీలు అందరూ పార్లమెంటులో భద్రత గురించిన అంశాన్ని లేవనెత్తారు. తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ ఘటనపై చర్చించాలని పట్టుబట్టారు. ఎంపీల డిమాండ్‌కు స్పందించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. ఈ ఘటనలో మొత్తం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లోక్‌సభ లోపలికి ప్రవేశించిన ఇద్దరు దుండగులతోపాటు బయట మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. నిందితుల దగ్గర ఉన్న వస్తువులు, ఇతర సామాగ్రిని ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. లోక్‌సభలోకి ఆగంతకులు చొరబడిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతామని ఎంపీలకు తెలిపారు. ఆ దర్యాప్తుకు సంబంధించిన పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. నలుగురు నిందితుల్లో ఒకరు మహిళ కూడా ఉన్నట్లు చెప్పారు. బీజేపీకి చెందిన మైసూర్ ఎంపీ ప్రతాప్ పేరిట ఉన్న పాస్‌లతోనే నిందితులు పార్లమెంటులోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.
అయితే సభ లోపలికి ప్రవేశించిన నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగ మాత్రమేనని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని స్పీకర్ చెప్పారు. ఆ పొగ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీలకు తెలిపారు. అయితే నిందితులు వదిలింది ఏ గ్యాస్ అనే దానిపై సమగ్ర విచారణ జరుపుతామని.. ఈ ఘటనపై సాయంత్రం సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. భద్రతపై ఎంపీలు చేస్తున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే.. లోక్‌సభను సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అని స్పీకర్ ఓం బిర్లా హితవు పలికారు.