ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం..2001 డిసెంబరు 13న పార్లమెంట్‌పై ఉగ్రదాడి,,,,తాజాగా లోక్‌సభలోకి టియర్ గ్యాస్ వదిలిన

national |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2023, 10:53 PM

శీతకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌‌లో బుధవారం భద్రతా వైఫల్యం కలకలం రేపింది. లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా సభ చాంబర్‌లోకి దూకారు. అనంతరం అక్కడ ఉన్న టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను వాయిదా వేశారు. ఆగంతకులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ ఉన్నారని అధికారులు తెలిపారు. నిందితులను నీలం, అమోల్ షిండేగా గుర్తించారు. టియర్ గ్యాస్ బాటిల్‌ను షూలో దాచిపెట్టి.. లోపలికి ప్రవేశించారని భద్రతా సిబ్బంది తెలిపారు.


రాజ్యాంగాన్ని కాపాడాలి.. నియంతృత్వం చెల్లందంటూ షూ నుంచి టియర్ గ్యాస్ తీసి విసిరారు. పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన వార్షికోత్సవం రోజునే ఈ ఘటన జరగడం గమనార్హం. 2003 డిసెంబరు 13న పాక్ ఉగ్రవాదులు పార్లమెంట్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య దేవాలయంపై జరిగిన ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. ఉగ్రదాడిలో అమరులైన వారి కోసం సంస్మరణ సభను పార్లమెంట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేయగా.. ఉప-రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్‌, కేంద్రమంత్రులు సహా పత్రిపక్ష నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ముగిసిన కొద్ది సేపటికే ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి చాంబర్‌లోకి దూకారు. జీరో అవర్ జరుగుతుండగా.. ఉత్తర మాల్దా బీజేపీ ఎంపీ ఖాగేన్ ముర్ము మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఘటన చోటుచేసుకుంది. నిందితులు మైసూర్ ఎంపీ ప్రతాప్ పాస్‌లతో పార్లమెంట్‌లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. ‘తానా షాహీ బంద్ కరో.. భారత్ మాతాకీ జై’ అనే నినాదాలు చేశారు.


తాజా ఘటనపై కాంగ్రెస్ ఎంపీ చిదంబరం మాట్లాడుతూ.. ‘సభలో జీరో అవర్ జరుగుతోంది, నేను మాట్లాడేందుకు నా వంతు కోసం వేచి ఉన్నాను. అకస్మాత్తుగా, సందర్శకుల గ్యాలరీ నుంచి ఒకరు పడిపోయినట్లు కనిపించింది. అతను దూకడం ఉద్దేశపూర్వక చర్య అని అప్పుడు మాకు అర్థమైంది. మరొక వ్యక్తి ఉన్నారు.. ఇద్దరూ టియర్ గ్యాస్‌ను డబ్బాలను బయటకు తీసి వెదజల్లారు’ అని పేర్కొన్నారు. శివసేన (ఉద్ధవ్ వర్గం) అరవింద్ సావంత్ మాట్లాడుతూ. ‘ఎవరికీ గాయాలు కాలేదు. వారు కిందకు దూకినప్పుడు వెనుక బెంచీలు ఖాళీగా ఉండడంతో పట్టుకున్నారు...ఇద్దరు మంత్రులు సభలో ఉన్నారు’ అని తెలిపారు. ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. 2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థలకు చెందిన ముష్కరులు పార్లమెంట్‌ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులకు తెగబడ్డారు. యావత్ దేశం ఈ ఘటనతో ఉలిక్కిపడింది. ఈ దాడిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు కాగా.. ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com