అగ్రరాజ్యం స్థిరనివాసం, గ్రీన్ కార్డ్‌లు పొందాలనే కోరిక భారతీయులను తమ పిల్లలను మెక్సికో, కెనడాతో ఉన్న అమెరికా సరిహద్దుల వద్ద వదిలి వెళ్లేలా చేస్తోంది. అక్టోబరు 1, 2022 నుంచి 2023 సెప్టెంబరు 30 వరకూ గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా భద్రతా సిబ్బంది ఈ సరిహద్దుల్లో ఒంటరిగా 730 మంది భారతీయ చిన్నారులను గుర్తించారు. 2020 తర్వాత ఇంత సంఖ్యలో పిల్లలను గుర్తించడం ఇదే అత్యధికం. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (USCBP) డేటా ప్రకారం.. 2020, 2023 మధ్య రికార్డు స్థాయిలో 233% పెరుగుదల నమోదయ్యింది.
అక్టోబరులోనే 78 మంది పిల్లలను గుర్తించామని, వీరిలో 73 మంది మెక్సికో సరిహద్దుల్లో.. ఐదుగురు కెనడా సరిహద్దులో దొరికినట్టు తెలిపారు. ఈ పిల్లలలో చాలా మంది 10 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్నవారేనని, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న మరో నలుగురు పిల్లలను వదిలివేసిన సందర్భాలు ఉన్నాయని పరిణామాలకు సంబంధించిన విశ్వసనీయ మూలాలు వెల్లడించాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులు చట్టవిరుద్ధంగా అమెరికాకు చేరుకుని, తమ పిల్లలను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం అమెరికా సరిహద్దు వరకు పిల్లలను తీసుకువచ్చే ఇతర అక్రమ వలసదారులతో సమన్వయం చేసుకుంటారు. పిల్లలను సరిహద్దులో వదిలివేస్తే అమెరికా భద్రతా సిబ్బంది వారిని కస్టడీలోకి తీసుకుని, సురక్షితంగా ఉంచుతాయని అక్రమ వలసదారులకు తెలుసని ఓ సోర్స్ తెలిపింది.
ఈ పిల్లలను కస్టడీలోకి తీసుకున్న తర్వాత అమెరికాలోని వారి తల్లిదండ్రులు లేదా బంధువులు న్యాయవాది ద్వారా సంప్రదిస్తారు. అనంతరం పిల్లలను సంరక్షకులుగా కాపాడుకుంటారు. మానవ అక్రమ రవాణాలో ఈ ధోరణిని గుజరాత్ పోలీసు అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఇది తల్లిదండ్రులు, మానవ అక్రమ రవాణాదారులకు అనుకూలమైన పరిస్థితిగా మారుతుందన్నారు.‘అమెరికాలో పిల్లలు చాలా సులభంగా గ్రీన్ కార్డ్‌లను పొందుతారు.. కొన్ని సందర్భాల్లో పిల్లలను ముందుగా అక్కడకు పంపుతారు.. తర్వాత వారి తల్లిదండ్రులు వెళ్లి ఆశ్రయం పొందుతారు’ పోలీసు అధికారి చెప్పారు. ఉత్తర గుజరాత్‌లోని మెహ్సానా, గాంధీనగర్ జిల్లాల నుంచి చాలా మంది స్మగ్లర్లు ఈ పద్ధతిలో పిల్లలను అమెరికాకు పంపుతున్నారని, ఇది వారి తల్లిదండ్రులు యుఎస్‌లో స్థిరపడటానికి కూడా సహాయపడుతుందని ఒక మూలం తెలిపింది. అయితే, ఈ పర్యవసానాలు పిల్లలకు అనుకోకుండా హాని కలిగించడంతో పాటు వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గత నాలుగేళ్ల కిందటితో పోల్చితే ఇవి గతేడాది భారీగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.