ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఇపుడు ప్రశాంత్ కిశోర్ అంశం చర్చాంశనీయంగా మారింది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం ఏపీ రాజకీయాలను కుదిపేసిందని చెప్పుకునే లోపే, అంతకంటే పెద్ద కుదుపు ఐప్యాక్ రూపంలో వచ్చింది. తాము వైసీపీతోనే ఉన్నామంటూ ఐప్యాక్ సంస్థ స్పష్టమైన ప్రకటన చేసింది. తెర వెనుక ఎన్నికల వ్యూహాలను అమలు చేసే సంస్థగా ఐప్యాక్ కు గుర్తింపు ఉంది. ఐప్యాక్ ను స్థాపించింది ప్రశాంత్ కిశోర్ అని తెలిసిందే. కాగా, ఇవాళ జరిగిన పరిణామాల నేపథ్యంలో, అన్ని ఊహాగానాలకు తెరదించేలా ఐప్యాక్ సోషల్ మీడియాలో స్పందించింది. "గత ఏడాది కాలంగా ఐప్యాక్ సంస్థ వైసీపీతో కలిసి పనిచేస్తోంది. 2024లో ఎన్నికల్లోనూ సీఎం జగన్ ఘనవిజయం సాధించేలా... వైసీపీతో కలిసి మేం అంకితభావంతో, అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. సీఎం జగన్ మళ్లీ గెలిచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు తన తిరుగులేని పాలన కొనసాగించేలా చేయడమే మా లక్ష్యం" అంటూ ఐప్యాక్ ట్వీట్ చేసింది.