తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడసేవ నిర్వహిస్తారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో అధ్యాయనోత్సవం నిర్వహిస్తున్నందున పౌర్ణమి గరుడసేవ ఉండదని టీటీడీ తెలిపింది. భక్తులు గమనించాలని కోరారు.
ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్కరోజు రూ. 5.05 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆ రోజు 63,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ దర్శనాలు ఈ నెల 23 నుంచి ప్రారంభమై జనవరి 1 వరకు కొనసాగనున్నాయి. దీంతో స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.