ట్రెండింగ్
Epaper    English    தமிழ்

4 పీజీలు, పీహెచ్‌డీ చేశాడు.. ప్రొఫెసర్ జాబ్ మానేసి కూరగాయలు అమ్ముతున్నాడు

national |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 11:05 PM

డాక్టర్ సందీప్ సింగ్. పీహెచ్‌డీ, 4 పీజీ పట్టాలు అందుకున్న ఓ వ్యక్తి. కాంట్రాక్ట్ ప్రొఫెసర్ అనేది ఒకప్పుడు.. కానీ ఆయన ప్రస్తుతం కూరగాయలు అమ్ముతున్నాడు. గొప్ప గొప్ప చదువులు చదివి, డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీ పట్టా అందుకున్నా.. తోపుడు బండిపై ఇంటింటికీ తిరిగి కూరగాయలు విక్రయిస్తున్నాడు. పంజాబ్‌కు చెందిన 39 ఏళ్ల సందీప్‌ సింగ్.. ఇలా బండిపే కూరగాయలు అమ్ముతూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంకా తన కూరగాయల బండికి పీహెచ్‌డీ సబ్జీవాలా అనే బోర్డును కూడా పెట్టుకుని విక్రయిస్తున్నాడు.


అయితే తన వద్ద పీజీ, పీహెచ్‌డీ పట్టాలు.. పేరు చివరన అనేక డిగ్రీలు ఉన్నా, ఉన్నత చదువులు పూర్తి చేసి ఇప్పుడు వీధుల్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించాల్సిన వచ్చింది. అయితే సరైన ఉద్యోగం దొరక్క ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నాడు. కాంట్రాక్ట్‌ ప్రొఫెసర్‌గా కన్నా.. కూరగాయలు అమ్మితేనే ఎక్కువ సంపాదన వస్తుందని డాక్టర్ సందీప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రతీ ఒక్కరినీ కదిలిస్తున్నాయి. దీంతో ఆ వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.


పంజాబ్‌ యూనివర్సిటీ లా విభాగంలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌గా డాక్టర్ సందీప్‌ సింగ్‌.. 11 ఏళ్లు పని చేశాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు.. పంజాబీ, జర్నలిజం, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో పీజీ పూర్తి చేశాడు. అయితే సమయానికి వేతనాలు సరిగా ఇవ్వకపోవడం, వచ్చిన ఆ కొద్ది జీతంలోనే కోతలు విధించటంతో కాంట్రాక్ట్‌ ప్రొఫెసర్‌‌గా కుటుంబాన్ని పోషించలేకపోయాడు. చాలీ చాలని జీతంతో సందీప్ తన కుటుంబాన్ని పోషించడానికి నానా ఇబ్బందులు పడ్డాడు. దీంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగం చూసుకోవాలని భావించాడు. జీతం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో పంజాబ్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలేసినట్లు డాక్టర్ సందీప్ సింగ్ తెలిపారు.


అయితే ఉద్యోగం వదిలేసిన తర్వాత కుటుంబాన్ని పోషించాలంటే ఏదో ఒక పని ఉండాలని భావించిన డాక్టర్ సందీప్ సింగ్.. కూరగాయలు అమ్మడం ప్రారంభించినట్లు చెప్పాడు. అయితే తాను ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతున్నానని.. కానీ తనకు టీచింగ్‌పై ఉన్న ఇష్టం, మక్కువ పోలేదని సందీప్ సింగ్ తెలిపాడు. ప్రస్తుతం కూరగాయలు విక్రయించడం ద్వారా.. అంతకుముందు ప్రొఫెసర్‌గా చేసిన జాబ్‌ కంటే ఎక్కువ డబ్బే సంపాదిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే అందులో నుంచి కొంత డబ్బు పొదుపు చేసి.. ఏదో ఒక రోజు ట్యూషన్‌ సెంటర్‌ ప్రారంభిస్తానని డాక్టర్ సందీప్ సింగ్ తన కోరికను బయట పెట్టాడు.


అయితే సందీప్ సింగ్ ఓ బండి మీద ఊరూరా తిరిగి కూరగాయలు అమ్ముతున్నాడు. ఆ బండి మీద పీహెచ్‌డీ సబ్జీవాలా అని రాసుకున్నాడు. అయితే ఆ బండిని ఫొటో తీసి ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇంత జరిగినా చదువుపై ఇష్టం పోని సందీప్ సింగ్.. ప్రస్తుతం మరో డిగ్రీ సంపాదించేందుకు ఉదయం కూరగాయలు అమ్ముతూ సాయంత్రం పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa