వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించే పదవీపై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష పదవీ ఇస్తుందా.. లేదంటే ప్రచార కమిటీ బాధ్యతలను భుజాన వేస్తుందా అనే సందేహాలు వస్తున్నాయి. షర్మిల నిన్న(గురువారం) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోనే ఉన్న ఆమె శుక్రవారం నాడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అయ్యారు. ఆ సమయంలో అక్కడ మాణిక్కం ఠాగూర్ ఉన్నారు.ఏపీ రాజకీయ పరిస్థితులు, పార్టీలో పదవీ, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై ఖర్గే, వేణుగోపాల్‌తో చర్చించారని విశ్వసనీయ సమాచారం. ఏపీలో బాధ్యతల స్వీకరణకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిల చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రావడంతో అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కూడా ఆమెకు ఏ పదవీ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న నేతలను కలుపుకొని వెళ్లడమే షర్మిల పని అవుతుంది.రాష్ట్రంలో ఉన్న మైనార్టీ ఓటు బ్యాంక్ కొల్లగొట్టే బాధ్యత ఆమె భుజాలపై పడింది. భర్త అనిల్ కుమార్ చేత జనంలోకి వెళ్లారని భావించి ఉంటారు. అనిల్ క్రైస్తవ మత ప్రచారకుడు అయినందున ఆ వర్గం ఓట్లపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. దీంతోపాటు మణిపూర్‌లో చర్చిల కూల్చివేత అంశం గురించి షర్మిల బహిరంగంగా మాట్లాడారు. దీంతో కూడా ఆ కమ్యూనిటీ షర్మిలకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.