హమాస్ దాడుల తర్వాత పాలస్తీనీయులను పనిలో నుంచి తొలగించిన ఇజ్రాయెల్.. వారి వర్క్ పర్మిట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాలస్తీనా వర్కర్ల స్థానాన్ని భారతీయులతో భర్తీ చేస్తామని ఇజ్రాయెల్ అప్పుడే ప్రకటించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి సరిగ్గా వంద రోజులు పూర్తయిన వేళ.. 15 మంది సభ్యులతో కూడిన ఇజ్రాయెల్ బృందం సోమవారం ఇండియాకు వచ్చింది. ఈ టీమ్ భారత వర్కర్లను ముఖ్యంగా భవన నిర్మాణ రంగ కార్మికులను రిక్రూట్ చేసుకోనుంది. జనవరి 16న హర్యానాలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించిన ఇజ్రాయెల్ టీమ్.. 20వ తేదీ వరకూ బార్ బెండర్, మేస్త్రీ, టైర్, కార్పెంటర్.. తదితర ఉద్యోగాల కోసం పది వేల మందికిపైగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. వీరికి నెలకు రూ.1.37 లక్షల జీతంతోపాటు మెడికల్ ఇన్సూరెన్స్ కల్పిచనుంది. వారికి భోజనం, వసతి సదుపాయం కూడా కల్పించనుంది. అంతే కాకుండా నెలకు రూ.16,515 బోనస్ కూడా అందించనుంది.
కార్మికుల నియామకం విషయమై భారత్, ఇజ్రాయెల్ ప్రభుత్వాల మధ్య గత ఏడాది నవంబర్ 3న ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి కనీసం ఏడాది కాలానికి వీసా వర్క్ పర్మిట్ జారీ చేస్తారు. దాన్ని గరిష్టంగా 63 నెలలు పొడిగిస్తారు. హమాస్‌తో ఘర్షణ వాతావరణం ఉన్న నేపథ్యంలో.. అలాంటి ఘర్షణలు తలెత్తే ప్రాంతాలకు దూరంగా భారత వర్కర్లను ఉంచుతారు. ఒప్పందం ప్రకారం ఈ ఉద్యోగాలు ఇజ్రాయెల్ చట్టాలు, నిబంధనలు, విధానాలకు అనుగుణంగా ఉంటాయి. లీగల్‌గా విదేశాలకు వలస వెళ్లే వారందరికీ ప్రవాసీ భారతీయ బీమా యోజన వర్తిస్తుంది. ఎక్కడ పని చేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఈ బీమా వర్తిస్తుంది. ఆన్‌లైన్ ద్వారానూ రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది. తదుపరి రౌండ్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను జనవరి 23 నుంచి 31 వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడతారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్‌కు కార్మికులకు పంపించే యోచనలో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa