అయోధ్యలోని రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న గర్బాలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉచితంగా శ్రీవారి ప్రసాదాన్ని అందజేయనుంది. ఇందుకు లక్ష లడ్డూలను అయోధ్యకు పంపింది. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానం ద్వారా ఈ లడ్డూలను శుక్రవారం సాయంత్రం తరలించింది. సోమవారం దేశమంతా రామనామంతో మారుమ్రోగనున్న వేళ….రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది.
లడ్డూల తరలింపుపై టీటీడీ జేఈవో వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ… అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలకమండల నిర్ణయం తీసుకుందని తెలిపారు. లక్ష లడ్డూలను తయారు చేసి…గురువారం ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించామని చెప్పారు. తిరుమల నుంచి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తరలించి, అక్కడ నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలించినున్నట్టు జేఈవో వివరించారు. ఈ నెల 22న అయోధ్యలో భక్తులకు ప్రసాదం పంపిణి చేస్తారని చెప్పారు.
స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూలను తయారు చేయించామన్నారు. ఏరో గ్రూప్ సహాయంతో ప్రత్యేక కార్గో విమానం ద్వారా అయోధ్యకు లడ్డూ ప్రసాదం వెళ్లనుందని వీరబ్రహ్మం తెలియజేశారు. మరోవైపు, ఆలయ ప్రారంభోత్సవానికి దేశంలోని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు దాదాపు 8 వేల మందికి ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్పర్సన్ కుమార్ మంగళం బిర్లా, పిరామల్ గ్రూప్ ఛైర్పర్సన్ అజయ్ పిరమల్, మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, టీసీఎస్ సీఈఓ కృతివాసన్ను రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది.