టీడీపీపై వైసీపీ నేత కేశినేని నాని విమర్శలు గుప్పించారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే తాను వైసీపీలో చేరానని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పిలవడంతో వెంటనే తాను వైసీపీలో చేరానని చెప్పారు. రాజకీయాల్లో చంద్రబాబు స్థాయి, తన స్థాయి ఒకటేనని అన్నారు. నారా లోకేశ్ స్థాయి తనతో పోల్చుకుంటే చాలా తక్కువని చెప్పారు. తెలుగుదేశం పార్టీ 60 శాతం ఖాళీ అవుతుందని తాను ఇప్పటికీ చెపుతున్నానని అన్నారు. కంచికచర్ల మండలం పెండ్యాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
తన వెనుక ఎవరూ లేరని ఆయన సోదరుడు కేశినేని చిన్ని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని మండిపడ్డారు. గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని చెప్పారు. ప్రజలంతా జగన్ వెనుక ఉన్నారని... వైసీపీలో నాయకుల పాత్ర తక్కువ, ప్రజల పాత్ర ఎక్కువ ఉంటుందని అన్నారు. కాల్ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వారి గురించి తాను మాట్లాడనని చెప్పారు.