ఇచ్ఛాపురం: తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామంటూ వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన సవాల్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.అభివృద్ధిని చూసేందుకు తాను సిద్ధమని.. తేదీ, సమయం చెప్పాలని ఛాలెంజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో వివిధ అంశాలపై ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం బస్సులోనే మీడియాతో ఆమె మాట్లాడారు. సీఎంను తాను జగన్‌రెడ్డి అంటే సుబ్బారెడ్డికి నచ్చడం లేదన్నారు. ఇకపై ఆయన్ను అన్న గారు అనే అంటానని వ్యాఖ్యానించారు.
''సుబ్బారెడ్డి గారూ.. మీ సవాల్‌ను స్వీకరిస్తున్నా. మీరు చేసిన అభివృద్ధిని చూపించండి. దానిని చూసేందుకు నేను సిద్ధం. తేదీ, సమయం మీరు చెప్పండి.. లేదంటే నేను చెబుతా. అభివృద్ధి పరిశీలనకు మేధావులను కూడా పిలుద్దాం. నాతో పాటు మీడియా, ప్రతిపక్షాలు కూడా వస్తాయి. చేసిన అభివృద్ధి ఏంటో అందరికీ చూపించండి. అభివృద్ధి ఎక్కడ? మీరు చెప్పిన రాజధానులు ఎక్కడ?కడతామన్న పోలవరం ప్రాజెక్టు ఎక్కడ?'' అని షర్మిల నిలదీశారు.
తమను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ బెంతొరియా ప్రతినిధులు షర్మిలకు వినతిపత్రం అందజేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు మెళియాపుట్టిలో తమ సామాజిక వర్గం ఉందని తెలిపారు. కులం పరంగా ఎలాంటి గుర్తింపునకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు, ఉద్యోగాలకు అర్హత పొందేలా సమగ్ర ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని.. వైకాపా ప్రభుత్వం గత ఏడాది జనవరి 30 నుంచి వాటిని నిలిపివేసిందని షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు.