సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల జీవన ప్రమాణాలు పెంచారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇప్పిలి గ్రామంలో నాలుగో విడత వైయస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రెవెన్యూ శాఖా మంత్రి వర్యులు ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."డ్వాక్రా సంఘాలకు సంబంధించి నాలుగో విడత బకాయిలను ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. 2014 ఎన్నికల ముందు మహిళా సంఘాలకు సంబంధించి అప్పటిదాకా ఉన్న బ్యాంకు బకాయిలు చెల్లిస్తాం అని చెప్పి, మీతో ఓటు వేయించుకు న్నారు. కానీ ఆ రోజు అప్పటి నాయకులు అందరినీ మోసం చేశారు. బ్యాంకుకు మీ తరఫున రుణం కట్టలేదు. అటుపై మీరెవ్వరూ బ్యాంకు మెట్లు ఎక్కలేకపోయారు.2019లో పాదయాత్ర చేస్తున్నపుడు వైయస్ జగన్ ఆ రోజు మహిళా సంఘాల సమస్య గుర్తించి,అధికా రం వస్తే నాలుగు దఫాలలో చెల్లిస్తాం అని చెప్పారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ.. ఈ రోజు నాలుగో దఫా చెల్లించారు సీఎం జగన్. ఇన్ని మంచి పనులు చేశాం అంటే ఆ రోజు ఇచ్చిన అధికారం వల్లనే సాధ్యం అయింది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. మీరు వీటన్నింటినీ గుర్తు పెట్టుకుని మీ ఆర్థిక వికాసానికి,మీ సర్వతోముఖాభివృద్ధికీ కృషి చేసిన వారికి అండగా ఉండండి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచిన వైయస్ జగన్ కు మద్దతుగా ఉండాలి అని కోరుతున్నాను. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న సీఎం జగన్ కావాలా ? ఇచ్చిన హామీలు గాలికి వదిలి మోసం చేసిన విపక్ష నేత చంద్రబాబు కావాలా ? ఎన్నికల కాలం సమీపిస్తున్నందున మోసం చేయాలన్న ఆలోచన ఉన్నవారు ప్రతిపక్ష నేతలు అనేక రూపాల్లో వస్తారు.