ఆదివారం రాత్రి రెండో దఫా భేటీ అయిన బాబు, పవన్ అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగించారు. సోమవారం నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్తుండడంతో వీలైనన్ని ఎక్కువ సీట్లపై ఆదివారమే స్పష్టత తేవాలన్నది వారి ప్రయత్నంగా చెబుతున్నారు. త్వరగా స్పష్టత వస్తే ఎవరికి వారు తమ పార్టీల్లో నేతలతో చర్చలు, సంప్రదింపులు, బుజ్జగింపులు పూర్తి చేసుకోవచ్చన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. చర్చల సరళిపై చంద్రబాబు, పవన్ ఎవరి వద్దా పెదవి విప్పడం లేదు. పూర్తిగా వారిద్దరే ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 8న మరోసారి సమావేశమవుతారు. ఈ భేటీ తర్వాత రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణపై స్పష్టత వస్తుందని ఆ పార్టీల వర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అందులో చంద్రబాబు, పవన్ ఇద్దరూ పాల్గొంటారు. ఉమ్మడి మేనిఫెస్టోను ఆ సందర్భంగా విడుదల చేయాలని నిశ్చయించారు. అదే సభలో పొత్తు కుదిరిన సీట్ల వివరాలు కూడా ప్రకటిస్తారా.. లేక మరో సందర్భం ఎంచుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. కలిసి ఒకరోజు పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందన్నదానిపైనా చర్చించుకున్నారు. అపోహలకు తావు లేకుండా పరస్పరం సహకరించుకోవాలని, ఎవరి పార్టీ నేతలకు వారు పరిస్థితిని వివరించి.. కలిసి పనిచేసే వాతావరణం నెలకొల్పాలని ఉభయులూ అనుకున్నారు.