పెళ్లైన రెండు నెలలకే భార్య వేధింపులకు తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్పీ ఆఫీస్ ఎదుట బాధితుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సుంగర్హి ప్రాంతానికి చెందిన బాధిత యువకుడు ప్రదీప్‌కు ఇషా అనే యువతితో రెండు నెలల కిందట వివాహం జరిగింది. అయితే, పెళ్లైన కొద్ది రోజులకే ప్రదీప్‌ను ఇషా వేధించడం మొదలుపెట్టింది. తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని, లేకుంటే గృహహింస కేసు పెడతానని బెదిరింపులకు దిగుతోంది. రోజు రోజుకూ ఆమె వేధింపులు శ్రుతిమించడంతో ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అందుకు పోలీసులు నిరాకరించారు. అంతేకాదు, తిరిగి ప్రదీప్‌పైనే ఇషా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన బాధితుడు.. శనివారం ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. అక్కడ ఎస్పీ అందుబాటులోకి లేకపోవడంతో ఆయన నివాసానికి చేరుకున్నాడు. ఎస్పీ ఇంటి ఎదుట తన వెంట తీసుకొచ్చిన విషం తాగి కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన భద్రతా సిబ్బంది ప్రదీప్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రదీప్ మృతిచెందాడు.
తొలుత ఈ ఘటనపై ఎస్పీ అతుల్ శర్మ మాట్లాడుతూ.. బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అయితే, కొద్దిసేపటికే ప్రదీప్ చనిపోయినట్టు స్థానిక సీఐ దీపక్ చతుర్వేది వెల్లడించారు. బరేలి జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు ఒదిలాడని అన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు.