టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడితే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రకటించారు. ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్.. ఉత్తరాంధ్రకు ఏం చేశాడని నిలదీశారు. తామొచ్చాక ఈ ప్రాంతం నుంచి వలసలు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ‘శంఖారావం’ పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఆయన ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. జగన్ ప్రభుత్వ అరాచక పాలనపై విరుచుకుపడ్డారు. నాలుగేళ్లు పడుకొని ఇప్పుడు డీఎస్సీ అంటున్నారని ఆక్షేపించారు. ‘ప్రభుత్వంలో 2.30 లక్షల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి జగన్ మడమ తిప్పాడు. డీఎస్సీలో కేవలం 6వేల పోస్టులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ పాలనలో లక్షా 30 వేల పోస్టులు భర్తీ చేశాం. మళ్లీ వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం’ అని ప్రకటించారు.